"గతంలో 25 సంవత్సరాలకో, షష్టి పూర్తికో, 50 సంవత్సరాలకో "వివాహ వార్షికోత్సవ" ప్రకటనలు ఇచ్చేవాళ్ళు కాని ఇప్పుడు నాలుగైదేళ్ళు కలిసి కాపురం చేస్తేనే అదో గొప్ప విషయంగా తయారైంది" అంటూ ఆయన నిట్టూర్పు విడిచాడు.. నిజమే సుమా! ఆయన అన్నది నూటికి నూరుపాళ్ళు నిజం!! పెళ్లి వార్త విన్న కొంతకాలానికే ఆ దంపతుల విడాకుల వార్త వినవలసి రావటం ఈ మధ్య చాలా సందర్భాల్లో భాద కలిగించింది.
ఇప్పుడంతా "ఫాస్ట్ ఫుడ్స్" కాలం! స్నేహాలు, ప్రేమలు, పెళ్ళిళ్ళు, అన్నీ త్వరగా మొదలయ్యి అంత త్వరగానే ముగుస్తున్నాయి. ఈ కాలం యువతీ యువకుల్లో ఓర్పు, సహనం, నీతి, నియమం తగ్గిపోయి, ఆ స్థానంలో చిరాకు, అసహనం, అహంభావం, కోరికలు ఎక్కువయ్యాయి.
ఈ కాలం కుర్రకారుకు తమకేంకావాలో వాళ్ళకే సరైన అవగాహన ఉండటంలేదు. అందింది రుచించదు... అందని దానికోసం అర్రులు చాచి చేతిలోదానిని నేలపాలు చేసుకుంటున్నారు. వీళ్ళు "కలల లోకంలో బ్రతికేస్తూ వర్తమానాన్ని విస్మరించి, భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు".
విడి కుటుంబాలు (Nuclear families), నగర వాతావరణం, సినిమాలు, ఇంటర్నెట్, విచ్చలవిడి స్నేహాలు, చేతినిండా డబ్బు, తల్లి తండ్రుల ఆజమాయిషీ లేకపోవటం, హైక్లాస్ కల్చర్ ఈ కాలం యువతను వ్యసనాలకు బానిసలను చేస్తున్నాయి... వివాహ బంధంలో విశిష్టతను వాళ్ళు గుర్తించటం లేదు.. బట్టలు మార్చినంత తేలికగా జీవిత భాగస్వామ్యులను మార్చివేస్తున్నారు...
మార్పు మంచిని తీసుకురావాలి.. కాని, చెడును ప్రోత్సహించే ఈ మార్పు మనకొద్దు... గతించిన రోజులు, ఆ జ్ఞాపకాలే ఎంతో మధురంగా ఉన్నాయ్!. కాలచక్రం మళ్లీ వెనక్కు తిరిగితే యెంత బాగుంటుంది!!