ప్రతి విషయానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్నో, తెలుగుదేశం ప్రభుత్వాన్నో, భాద్యులను చేస్తూ, తన ప్రభుత్వ వైఫల్యాలకు చంద్రబాబు నాయుడును కారణంగా చూపి తప్పించుకోచూస్తున్నాడు. కర్నాటక, మహారాష్ట్రల నుండి తెలంగాణా ప్రాజెక్టులకు నీరు విడుదల కాకపోవటానికి, సరైన సమయంలో వర్షాలు పడక పోవటానికి, నీరు లేక పంటలు ఎండి పోవటానికి, రైతుల ఆత్మహత్యలకు, కరెంటు కోతలకు, నిరుద్యోగం ప్రబలి పోవటానికి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తల వెనుకంజకు ఇలా ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు పైనే విమర్శలు గుప్పించటం ఈ ముఖ్యమంత్రి చేతకాని తనానికి నిదర్శనం. ఈ ప్రయత్నంలో ప్రజలను నమ్మించటంలో కొంతవరకు సఫలీకృతుడైనా, విజ్ఞులైన తెలంగాణా ప్రజలు నిదానంగా నిజా నిజాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతులు, పారిశ్రామికులు, కెసిఆర్ చెప్పే కాకమ్మ కథలు వినే పరిస్థితిలో లేరు. ఈ విషయం కెసిఆర్ కు, తెరాస శ్రేణులకు కూడా పూర్తిగా తెలిసి వచ్చింది. అందుకే చాలా విషయాల్లో మౌనం వహించటమో, వెనుకంజ వేయటమో లేక ఇతరులకు ఆ బురద పులమటమో చేస్తున్నారు.
నిజంగా కెసిఆర్ కు దమ్ముంటే ఈ క్రింది విషయాల్లో వెంటనే తన వైఖరి ఏమిటో తెలియచేయగలడా?
* తెలంగాణలో వందలాదిమంది రైతుల ఆత్మహత్యలకు భాద్యత వహించి రాజీనామా చేసే దమ్ముందా?
* నక్సలైట్ల పేరు చెప్పి బూటకపు ఎన్ కౌంటర్ లో ముగ్గురు తెలంగాణా బిడ్డలను పొట్టన పెట్టుకున్న ఘాతుకానికి భాద్యత వహించే దమ్ముందా?
* నువ్వు చెప్పిన సంవత్సరానికి లక్ష ఉద్యోగాల ప్రకారం తెలంగాణా రాష్ట్రంలో ఈ 16 నెలల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసారో చెప్పగలిగిన దమ్ముందా?
* తెలంగాణా ఉద్యమంలో అసువులు బాసిన వ్యక్తుల కుటుంబాల వారికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని కుటుంబాల వారికి యెంత మొత్తం పరిహారం ప్రకటించారో చెప్పగలరా?
* డబ్బులు, పదవుల ఆశ చూపించకుండానే ప్రతిపక్షాల శాసనసభ్యులను తమ పార్టీలోకి చేర్చుకున్నామని ఆత్మ సాక్షిగా చెప్పే దమ్ముందా?
* తమ పార్టీలో చేరిన ప్రతిపక్ష శాసనసభ్యుల చేత రాజీనామా చేయించి, ఉప ఎన్నికలు నిర్వహించి మరల గెలిపించుకోగలిగే దమ్ముందా?
* సంవత్సర కాలంగా కుంటి సాకులు చెప్పి వాయిదా వేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు వెంటనే నిర్వహించి మెజారిటి స్థానాలు గెలవగలిగే దమ్ముందా?
* ప్రతిపక్ష నాయకుల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రుల ఫోన్ టాపింగ్ చేయలేదని ప్రకటించే ధైర్యం ఉందా! ఒకవేళ ఫోన్ టాపింగ్ జరిగిందని రుజువైతే రాజీనామా చేసే దమ్ముందా?
* నువ్వు, నీ కొడుకు ఎన్ని దేశాలు తిరిగి ఎన్ని పరిశ్రమలు, పెట్టుబడులు సాధించారో శ్వేత పత్రం ప్రకటించే దమ్ముందా?
* చివరగా.... నీకు నిజంగా తెలంగాణా ప్రజల్లో గొప్ప ఆదరణ, పలుకుబడి ఉంటె కనుక రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే అదే స్థానంలో అతనిపై పోటి చేసే గెలిచే దమ్ముందా?