భారతదేశం లో గంగానది తరువాత అంత పేరుగాంచిన జీవ నది గోదావరి నది. ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా అభివర్ణిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం గల ఈ పుణ్ నది యొక్క రాశి సింహరాశి. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి యమునా నది పుష్కరాలు తరువాత గోదావరి పుష్కరాలు వస్తాయి. ఈ సమయం లో పుణ్యనగరి రాజమండ్రి కి దేశ విదేశాల నుండి భక్త జనం పోటెత్తుతుంది. లక్షలాది భక్తులు గోదావరి నది స్నానం కోసం రాజమండ్రి వస్తారు. ఈ సమయం రాజమండ్రి నగరం ప్రతేక శోభతో విరాజిల్లుతుంది.
పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ 'పుష్కరాలు' వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.
సాధారణంగా నదీ స్నానాలలో తర్పణం ,పిండ ప్రదానం మరియు శ్రాద్ధ కర్మలు చేసి పితరులను తృప్తి పరచి వారి ఆశీశ్శులు అందుకోవడం శుభప్రథమని విశ్వసిస్తారు.మొదటి రోజున హిరణ్య శ్రాద్దం,తొమ్మిదవ రోజున అన్న శ్రాద్ధం,పన్నెండవ రోజున ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని ఋషులు చెప్పారని పురాణాలు చెప్తున్నాయి.శ్రాద్ధకర్మలు ఉపనయనం,వివాహం అయిన పురుషులు తండ్రి మరణాంతరం మాత్రమే చేయాలి.
నీటిలో రెండు శక్తులున్నాయని వేదం చెప్తుంది.దాహార్తిని తీర్చడం,శుభ్రపరచడం అనే రెండు బాహ్య శక్తులైతే అంతరంగికంగా మేధ్యం,యజ్ఞనం అనేశక్తులున్నాయని వేదం వివరిస్తుంది.మేధ్యం అంటే నదిలో స్నానంచేసి మూడుసార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసే పాపాలు పోతాయని అలాగే యాజ్ఞనం అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీని వలన ద్రవ్య శుద్ధి జరుగుతుందని పురాణాల వర్ణన.నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శచే పాపాలు స్నానంద్వారా పటాపంచలు అవుతాయని విశ్వసిస్తారు.తీర్ధ స్నానం ఉత్తమం దానికంటే నదీ స్థానం ఉత్తమం దానికంటే పుష్కర సమయ నదీస్నానం ఉత్తమోత్తమం. ఆసమయంలో దేవతలలంతా పుష్కరునితో నదిలో ప్రవేశీస్తారని హిందువుల విశ్వాసం.త్రికరణాలతో చేసే పాపాలు పోతాయని,పుష్కర స్నానం ఒకసారి చేస్తే పన్నెండు సంవత్సరాల కాలం పన్నెండు పుణ్య నదులలో స్నానంచేసిన పుణ్యం లభిస్తుందని,అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని ఋషి వాక్కు. మోక్షప్రాప్తి కలుగుతుందని బ్రంహాండ పురాణం వర్ణిస్తుంది.
పుష్కరాలకు రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక్కసారి కోనసీమ, పట్టిసీమ అందాలను తిలకించటం మర్చిపోకండే!