రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పోకడ కూడా అదేవిధంగా ఉంది... అమావాస్యకో, పౌర్ణమికో నేనున్నానంటూ ఒకటి రెండు రోజులు హడావిడి చేయటం ఆ తరువాత సైలెంట్ అయిపోవటం ఇతనికి మామూలే! పవన్ కళ్యాణ్ కు బిజెపి రాజకీయం బాగా వంట పట్టింది.. చెప్పేది చేయక పోవటం, చేసేది చెప్పక పోవటం, ప్రచార ఆర్భాటం, మాటల్లోనే తప్ప చేతల్లో కనిపించని హామీలు ఇవన్నే పవన్ కళ్యాణ్ బాగానే వంట పట్టించుకున్నాడు. 'జన సేన' పార్టీ పెట్టి ఏదో పొడిచేస్తానని జనాలకు చెబుతాడు, మరో సారి బిజెపి ప్రభుత్వ పనితీరు బాగానే ఉంది కాబట్టి తనకు ఇప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెబుతాడు...
కాంగ్రెస్ పార్టీ గబ్బు పట్టిందని చెబుతూనే.. అదే పార్టీలో ఉన్న తన అన్న 'చిరంజీవి' ఒక 'ఆణి ముత్యం' అని కితాబిస్తాడు. పవన్ కళ్యాణ్ కు చాలా తిక్క ఉంది, కానీ దానికి ఏ లెక్క లేదు!... ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ బట్టి పట్టి సినిమాటిక్ డైలాగులు చెప్పటం... ఏ ఎండకా గొడుగు పట్టటం, ఎవడితో అవసరం ఉంటె వాడిని పొగడటం తప్ప తను రాజకీయ పార్టీ పెట్టి ప్రజలకు ఏమి చేస్తున్నాడో, ఏమి చేస్తాడో ప్రజలకు, అభిమానులకు చెప్పలేక పోతున్నాడు.
ఈ మధ్య వెంకయ్యనాయుడిని ఆకాశానికి ఎత్తడం వెనుక పెద్ద కథే ఉందంట! తన దగ్గరి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించినందుకు కృతజ్ఞతగా ఉడుతా భక్తిని చాటుకున్నాడట.. (ఎన్నికల ముందు 'జనశక్తి' పార్టీ ప్రచారం కోసం అంటూ పొట్లూరి వరప్రసాద్ తో పెట్టించిన ఖర్చు 50 కోట్లకు గాను వెంకయ్యనాయుడి ప్రాపకంతో కాంట్రాక్టు ఇప్పించి చెల్లుకు, చెల్లు చేసుకున్నాడంట). ఐనా చిరంజీవి కుటుంబం లోని వారు తమకు లాభం లేనిదే ఏ పని చేయరని సినిమా రంగంలో వారందరూ అంటారు, పవన్ కళ్యాణ్ కూడా అందుకు మినహాయింపు కాదు.
చిరంజీవి కమలం పార్టీలో చేరేందుకు పవన్ కళ్యాణ్ ద్వారా పావులు కదుపుతున్నాడని, పవన్ కళ్యాణ్ నటనకు స్క్రిప్ట్ చిరంజీవి, దర్శకత్వం అల్లు అరవింద్ అందిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో కొందరు గుసగుసలాడుకుంటున్నారు.
పార్టీ పెట్టిన చిరంజీవన్న జనాలకు చూపించిన సినిమా కన్నా, పార్టీ పెట్టకుండానే పవన్ కళ్యాణ్ జనాలకు మంచి మసాలా సినిమా చూపిస్తున్నాడు. ఈ పార్ట్ టైం రాజకీయ నాయకులూ, రోజుకో రకం సొల్లు కబుర్లు చెప్పే నటులు ఎల్లకాలం ప్రజలను నమ్మించలేరు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకుని బిజెపి ఏదో పొడిచేద్దాం అనుకుంటుంది కానీ ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పప్పులేమీ ఉడకవని వెంకయ్యనాయుడు, అమిత షా, మోడీ గుర్తుంచుకుంటే మంచిది.