శేషాచల కొండల వరుసలో తల బాగంలో వున్నందున ఈ పర్వత ప్రాంతాన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. దట్టమైన అడవి, ఎత్తైన కొండలకు మధ్య నుండి జాలువారే జలపాతం పర్యాటకులకు అందమైన అనుభూతి కలిగిస్తుంది.
తలకోన చేరుకోగానే మనకు దర్శనమిచ్చేవి సిద్దేశ్వరాలయము మరియు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు. అలయానికి అతిసమీపముగా వాగు ఒకటి ఎల్లపుడూ ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. పర్యాటకులు తీసుకువెళ్లే వాహనాలను ఈ దేవాలయ ప్రాతం వరకు మాత్రమే అనుమతిస్తారు. ఆపై జలపాతం వద్దకు చేరుకోవాలంటే నడకబాట పట్టాల్సిందే.
సిద్దేశ్వరాలయము నుండి కొంత ముందుకు సాగిన నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరి లకు వళ్ళవచ్చు. ఈ మూడింటికి చాల ప్రాముఖ్యత ఉంది. నెలకోన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది.
తలకోన ప్రకృతి శోభాయమానంతో అలరింపజేయడమే కాకుండా ఇదో పుణ్యక్షేత్రంగా దేదీప్యమానంగా మారుతోంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ జరిగే ఉత్సవా లలో రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతుండటంతో పాటు ప్రతి నిత్యం వందలాది సంఖ్యలో పర్యాటకులు తలకోనకు చేరుకుంటుంటారు.
కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు వెళితే అక్కడ జాలువారే జలపాతాన్ని మనం సందర్శించవచ్చు. రెండు కొండల మధ్య నుంచి జాలువారే జలపాత దృశ్యం బహు అద్భుతంగా ఉంటుంది. జలపాతానికి సమీపంలో కొంత ఎత్తువరకు ఆక్రమించిన బండరాళ్లపై పర్యాటకులు నిలబడి జలపాతం కింద తడవడానికి వీలవుతుంది. అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఏర్పడ్డ ఓ పెద్ద గుంటలాంటి ప్రదేశంలోని నీటిలో పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.
ఈ అటవీ ప్రాంతంలో అనేక రకాల వృక్షాలు అనగా మద్ది, చందనం ఎర్ర చందనం వంటి వృక్షాలు అధికంగా వున్నాయి. అడవి కోళ్లు, నెమళ్లు, , దేవాంగ పిల్లి, ఎలుగులు, ముచ్చు కోతులు వంటి జంతు జాలం వున్నది. ఇక్కడికి కొంత మంది ఔత్సాహికులు ట్రెక్కింగు కొరకు కూడ వస్తుంటారు. ప్రకృతిని పక్షులను జంతువులను చూడడానికి అటవీ శాఖవారు ఇక్కడ ఎత్తైన వాచ్ టవర్లను నిర్మించారు. వాటి పైకెక్కి చూడ వచ్చు.
తిరుపతి నుండి 49 కిలోమీటర్ల దూరంలో తలకొనకు బస్టాండ్ నుండి.ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. జాతీయ రహదారిపైన ఉన్న భాకరాపేట గ్రామం నుండి 24 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే తలకోన చేరుకోవచ్చు. భాకరాపేట నుంచి తలకోనకు నిత్యం ప్రయివేట్ వ్యాన్, ఆటోలు అందుబాటులో ఉన్నాయి.
తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడివద్దకు చేరుకుంటారు.
తలకోనలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు అతిథి గృహాలు ఉన్నాయి. ఇందులో 12 గదులు ఉన్నాయి. అడ్వాన్స్ బుకిం గ్ కోసం 08584-272425 నంబర్‌కు ఫోన్ చేసి రిజర్వేషన్ చేసుకోవచ్చు లేదా రాష్ట్రంలో ఎక్కడైనా పర్యాటకశాఖ కేంద్రాలు, అటవీశాఖ అధికారుల వద్ద గదులు బుక్ చేసుకోవచ్చు. డీలక్స్ గది అద్దె రూ. 500. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి గృహాలు, డార్మెంటరీలు ఉన్నా యి. 4 లాట్లు ఉండగా ఇందులో 6 గదులతో పాటు డార్మెంటరీ, సామూహిక బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే శాఖాహార, మాంసాహార భోజన సౌకర్యాన్ని అట వీశాఖ అందిస్తోంది